గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఫిర్యాదులపై విచారణ
కడ్తాల్: మండల పరిధిలోని ఎక్వాయిపల్లిలో భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు సంబంధించి గతంలో వచ్చి న ఫిర్యాధులపై బుధవారం విచారించారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయం వద్ద బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులు తమ అభిప్రాయాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో పాటు, అధికారుల దృష్టికి తెచ్చారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులకు భూమికి భూమి ఇవ్వాలని, లేని పక్షంలో కొంగరకలాన్‌లో ఇచ్చిన విధంగా ఎకరాకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు.


