పాడి రైతుల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు
కడ్తాల్: విజయ డెయిరీలో పాలు విక్రయించే రైతులు ఆర్థిక ప్రగతి సాధించేందుకు, తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య తోడ్పాటునందిస్తోందని విజయ డెయిరీ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ మోహన్ మురళి అన్నారు. మండల పరిధి మక్తమాధారంలోని పాలసేకరణ కేంద్రంలో బుధవారం 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తిదారులతో నిర్వహించిన సమావేశంలో మోహన్ మురళి మాట్లాడుతూ.. విజయ డెయిరీకి పాలు విక్రయించే రైతులను ప్రోత్సహించేందుకు పాడి పరిశ్రామిభివృద్ధి సహకార సమాఖ్య ప్రత్యేక కృషి చేయడం జరుగుతోందన్నారు. స్థానికంగా ఆయా గ్రామాల్లో బ్యాంకుల మేనేజర్‌లతో మాట్లాడి, పాడి రైతులకు పాడి పశువుల కొనుగోలుకు రుణాలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ ప్రాణేశ్‌కుమార్, సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.


