ప్రభుత్వ భూములపై టీజీఐఐసీ నజర్
యాచారం మండలంలో
భూ బ్యాంకు నోటిఫికేషన్
● ఉపాధి కోల్పోతామని రైతుల ఆవేదన
ఫార్మాసిటీ, పారిశ్రామికవాడ.. ఇలా అభివృద్ధి పేరిట సాగు భూములను లాక్కోవడంతో ఉపాధి కోల్పోతున్నామని యాచారం మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భూ బ్యాంకు మరింతగా నిరాశ్రయులను చేస్తుందని వాపోతున్నారు.
యాచారం: పారిశ్రామిక వాడ కోసమని యాచారం మండలంలోని సర్కారు భూములపై టీజీఐఐసీ దృష్టి పెట్టింది. రోడ్డు మార్గం అనువుగా ఉండడం, అత్యధికంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములే ఉండడంతో అధికారులకు భూసేకరణ అనుకూలంగా మారింది. గతంతో ఫార్మాసిటీ పేరుతో నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో వేలాది ఎకరాల భూమిని సేకరించింది. ఆయా గ్రామాల్లో దాదాపు 12 వేల ఎకరాలకు పైగానే అసైన్డ్, పట్టా భూముల సేకరణకు సిద్ధమై, ఇప్పటికే 9 వేల ఎకరాలు సేకరించింది. మరో 2,500 ఎకరాల పట్టా భూమి పరిహారాన్ని అథారిటీలో జమ చేసి, భూ రికార్డుల్లోని రైతుల పేర్లను మార్చేసిన అధికారులు టీజీఐఐసీ పేరును నమోదు చేశారు. రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేయాలని 900 మందికి పైగా రైతులు నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా స్పందన లేకుండా పోయింది. హైకోర్టు స్వష్టమైన ఆదేశాలిచ్చినా చలనం లేదు.
పారిశ్రామికవాడ కోసమని
పారిశ్రామికవాడ మొండిగౌరెల్లిలో 822 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరణకు అధికారులు నిర్ణయించారు. గత మార్చి నెలలోనే నోటిఫికేషన్ ప్రకటించి, పలుమార్లు గ్రామ రైతులతో సమావేశమై పరిహారాన్ని ఇచ్చే విషయంలో చర్చించారు. ఎకరాకు రూ.60 లక్షల పరిహారంతో పాటు ఎకరాకు 121 గజాల ప్లాటు ఇస్తేనే భూములు ఇస్తామని లేదంటే, ఇవ్వమని కర్షకులు మొండికేశారు. అధికారులు మాత్రం కేవలం రూ.22 లక్షలతోపాటు 121 గజాల ప్లాటు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతుల్లో అయోమయం నెలకొంది. తాజాగా భూ బ్యాంకు సిద్ధం చేసే పనిలో భాగంగా 250 ఎకరాలకు పైగా అసైన్డ్, ప్రభుత్వ భూములున్న యాచారం, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, చింతుల్ల, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి తదితర గ్రామాల వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
20 వేల మందికి పైగా
మండలంలోని ఫార్మాసిటీ, భూ బ్యాంకు సిద్ధం చేసిన పలు గ్రామాల్లో దాదాపు 20 వేల మందికి పైగా రైతులు నిరాశ్రయులుగా మారే ప్రమాదం ఉంది. అదే భూముల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేసే మరో 50 వేల మంది ఉపాధిని కోల్పోతారు. పాడి, పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి భూములే ఉండని దుస్థితి రావచ్చు. భూముల్లో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే ఫ్యూచర్‌సిటీ (ఫోర్త్) ఏర్పాటు అవుతుండొచ్చు. ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందొచ్చు. కానీ భూములు కోల్పో యే రైతులు, వాటిపై ఆధారపడి జీవనోపాధి పొందే కూలీలు బతుకులు ప్రశ్నార్థకంగా మారుతాయి.
అభిప్రాయాలు తీసుకోవాలి
ప్రభుత్వాలు భూసేకరణ విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మోజార్టీ రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తే ఆ గ్రామంలో ప్రక్రియ నిలిపేయాలి. భూములు కోల్పోయే రైతులు పూర్తిగా జీవనోపాధులు కోల్పోయే ప్రమాదం ఉంది.
– సుకన్య, మాజీ ఎంపీపీ యాచారం
మెరుగైన పరిహారం ఇవ్వాలి
భూసేకరణ చట్టాన్ని అధికారులు తుంగలో తొక్కుతున్నారు. చట్టం ప్రకారం రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడం లేదు. ఆ భూములపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న రైతులతో పాటు కూలీలను ఆదుకోవడం లేదు. ఫార్మాసిటీ భూసేకరణలో అదే జరిగింది.
– నర్సింహ, సీపీఎం మండల కార్యదర్శి
ఇదేక్కడి న్యాయం
భూములు కోల్పోయాక ఏం అభివృద్ధి జరిగితే ఏం ప్రయోజనం. ఫార్మాసిటీ పేరుతో పంటలు పండే పది ఎకరాలకు పట్టా భూమిని తీసుకోవాలని చూస్తున్నారు. ఇదేక్కడి న్యాయం. న్యాయమైన పరిహారం ఇవ్వడం లేదు. టీజీఐఐసీ పేరు ఉన్న భూ రికార్డులను రైతుల పేర్లపై మార్చడం లేదు.
– నిర్మలమ్మ, మాజీ సర్పంచ్, నక్కర్తమేడిపల్లి


