కులవివక్ష నిర్మూలనకు చర్యలేవి?
షాద్‌నగర్: గ్రామాల్లో కులవివక్ష నిర్మూలన కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు షాద్‌నగర్ ఆర్డీఓ సరితకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జంగయ్య మాట్లాడుతూ.. 15ఏళ్ల క్రితం గ్రామాల్లో కులవివక్ష, అంటరానితనం రూపుమాపేందుకు అధికారులు చర్యలు చేపట్టేవారన్నారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది ప్రతి నెల చివరి వారంలో గ్రామాలను సందర్శించి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేసేవారన్నారు. దీంతో అన్ని కులాలు, మతాల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేదన్నారు. ప్రస్తుతం అలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదన్నారు. కులవివక్ష కారణంగానే ఇటీవల ఎల్లంపల్లి గ్రామంలో దళిత యువకుడు రాజశేఖర్‌ను దారుణంగా హతమార్చారని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పవన్‌చౌహాన్, వెంకటయ్య, రమేష్ యాదవ్, నర్సింహ, రాజునాయక్, వీరేశం, మాసయ్య తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా
ప్రధాన కార్యదర్శి జంగయ్య


