
హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై వాహనాల రద్దీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల పొడవున ఎన్‌హెచ్ 163 రోడ్డు విస్తరణ పనులు ఒక అడుగు ముందుకు.. మరో నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. రూ.928.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పనులకు కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టు కూడా ఖరారైంది. రోడ్డు విస్తరణలో భాగంగా 145.42 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 350 ఎకరాల మేర సేకరణ పూర్తయింది. నష్టపరిహారాన్ని బాధితుల పేరున బ్యాంకులో జమ చేసింది.
ప్రభుత్వ, అసైన్డ్ భూముల సేకరణలో పెద్ద సమస్య లేదు కానీ..ప్రైవేటు పట్టా భూముల విషయంలోనే చిక్కంతా. కొంతమంది రైతులు నష్టపరిహారం చెల్లింపు విషయంలో కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా పనులకు అంతరాయం ఏర్పడింది. 46 కిలోమీటర్లు చేపట్టనున్న ఈ విస్తరణ పనుల్లో భాగంగా 18 చోట్ల అండర్‌పాసులు నిర్మించాల్సి ఉంది. మొయినాబాద్ సమీపంలో 4.35 కిలోమీటర్లు, చేవెళ్ల సమీపంలో 6.36 కిలోమీటర్లు బైపాస్ రోడ్డును నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క చోట కూడా పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. అత్యంత వేగంగా పూర్తి కావాల్సిన పనులు ఆగుతూ..సాగుతుండటంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. భూ సేకరణ, ఇతర అంశాల్లో తలెత్తిన అడ్డంకులను తొలగించి, పనుల్లో వేగం పెంచాల్సిన పాలకులు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు.
ఉదాసీన వైఖరి
మొయినాబాద్ నుంచి చేవెళ్ల వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా పురాతన మర్రి చెట్లు ఉన్నాయి. వీటిని తొలగించే విషయమై బన్యన్‌ట్రీ సంస్థ జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది. చెట్లను రీ లొకేట్ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక్క చెట్టును కూడా రీ లొకేట్ చేసింది లేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల ఉదాసీనతతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.
వడివడిగా ఎన్‌హెచ్ 65 విస్తరణ పనులు
మరోవైపు ఎల్బీనగర్ నుంచి మల్కాపురం వరకు రూ.545 కోట్ల అంచనా వ్యయంతో 25 కిలోమీటర్ల మేర చేపట్టిన విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్65) పనులు వడివడిగా సాగుతున్నాయి. ఇప్పటికే బాటసింగారం నుంచి పెద్ద అంబర్‌పేట్ వరకు 50 శాతం రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లను ఆరు లేన్లుగా విస్తరిస్తున్నారు. స్థానికులకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వనస్థలిపురం, సుష్మా, పనామా, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, కోహెడ జంక్షన్, కవాడిపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, ఇనాంగూడ, బాటిసింగారం ప్రాంతాల్లో అండర్ పాసులను ఏర్పాటు చేయనున్నారు.
ఏకధాటి వర్షాలకు తోడు.. విస్తరణ పనులు చేపడుతుండటంతో రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. వాహనాల రాకపోలకు ఇబ్బందిగా మారింది. హయత్‌నగర్ నుంచి పెద్ద బాటసింగారం వరకు సమస్య తీవ్రంగా ఉంది. రోడ్డు పనుల నాణ్యత విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల చేపట్టిన కాంక్రీట్ పనులు కూడా నాసిరకంగా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
వీకెండ్ వచ్చిందంటే చాలు బీజాపూర్ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారుతోంది. వేలాది వాహనాలు ఇరుకై న రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నాయి. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఖరీదైన వాహనాలే కాదు విలువైన ప్రాణాలు కోల్పోవాల్సివస్తోంది. నిత్యం నెత్తురోడుతూ.. అనేక మంది ప్రాణాలను హరిస్తున్న ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 29న కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ కిలోమీటర్ దూరం కూడా పనులు పూర్తి కాలేదు.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు (ఫైల్)