
ఎల్‌ఆర్‌ఎస్ అంతంతే..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమ లే అవుట్లను 25 శాతం రాయితీతో క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మే చివరి వరకు గడువు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు చెల్లించేందుకు ఎప్పటికప్పుడు గడువు పెంచుతూ వస్తున్నా.. ప్లాట్ల యజమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మూడు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,55,923 దరఖాస్తులు అందగా, వీటిలో 1,78,591 క్రమబద్ధీకరణకు అర్హత పొంది, అర్హులైన వారికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు 65,186 మంది మాత్రమే తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.255.56 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. 77,332 దరఖాస్తులకు సంబంధించిన ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో ఉన్నట్లు గుర్తించి, వాటిని రిజెక్ట్ చేశారు.
మూడుసార్లు గడువు పెంచినా..
ఖాళీ ప్లాట్లు/ లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం గత ప్రభుత్వం 2020లో నోటిఫికేషన్ జారీ చేసింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుకు రూ.పది వేలు, ఖాళీ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.వెయ్యి ఫీజుగా నిర్ణయించింది. ఆ మేరకు హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు జోన్లలో 3,58,464 దరఖాస్తులు రాగా, రంగారెడ్డిలోని మూడు కార్పొరేషన్లు, పదిహేను మున్సిపాలిటీల నుంచి రెండున్నర లక్షలకుపైగా, ఫరూఖ్‌నగర్, కేశంపేట, యాచారం, తలకొండపల్లి, కడ్తాల్, కొందుర్గు, మాడ్గుల, మంచాల, జిల్లెడు చౌదరిగూడెం మండల కేంద్రాల నుంచి 45 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. నిజానికి మూడేళ్ల క్రితమే ఈ దరఖాస్తులను స్వీకరించినప్పటికీ వివిధ కారణాలతో క్రమబద్ధీకరణ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో వన్‌టైన్ సెటిల్‌మెంట్ పథకాన్ని (ఓఎస్‌ఎస్) తీసుకొచ్చి 25 శాతం రాయితీ ప్రకటించింది. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం వాటి పరిశీలన కోసం రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు ఇప్పటికే ఆయా దరఖాస్తులను పరిశీలించాయి. తొలి గడువు మార్చి 31తో ముగిసింది. తర్వాత క్రమబద్ధీకరణ గడువును ఏప్రిల్ 30 వరకు పెంచింది. ఈ గడువు కూడా ముగిసిపోవడంతో మరో మూడు రోజులు అవకాశం కల్పించింది. అయినా ఆశించిన స్థాయిలో ఫీజు చెల్లింపులు కాకపోవడంతో తిరిగి నాలుగోసారి గడువును మే 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఫీజు చెల్లించక పోవడానికి కారణాలివే..
ఖాళీ ప్లాట్లకు రూ.లక్షల్లో ఫీజులు ఎందుకు చెల్లించాలనే భావన యజమానుల్లో ఉంది. గృహాలు నిర్మించే సమయంలో చెల్లిస్తే వడ్డీ కలిసి వస్తుందని భావిస్తున్నారు.
గతంలో భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతిస్తే.. సదరు స్థలం మార్కెట్ విలువను బట్టి దరఖాస్తుదారు ఫీజు చెల్లించేవారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలనకు ముందే ఫీజు చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించడంతో ఇందుకు వారు వెనుకాడుతున్నారు.
25 శాతం రాయితీ వర్తించాలంటే మొత్తం సొమ్ము ఒకే సమయంలో చెల్లించాల్సి వస్తోంది. వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం లేకపోవడం ఇబ్బందిగా మారింది.
ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న వారి ప్లాట్లు 111 జీఓ పరిధిలో ఉండటం, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయశాఖ, ప్రభుత్వ భూముల జాబితాలో నమోదై ఉండటంతో ఆ దరఖాస్తులు క్రమబద్ధీకరణకు నోచుకోలేకపోతున్నాయి.
గడువు పొడిగిస్తున్నా స్పందన నామమాత్రమే
25 శాతం రాయితీ ఇచ్చినా ప్రభావం కొంతే..
క్రమబద్ధీకరణకు ఆసక్తి చూపని యజమానులు
ఆశించిన ఆదాయం రూ.600 కోట్లకుపైగా
ఇప్పటి వరకు సమకూరింది రూ.255 కోట్లే
ఈ నెలాఖరు వరకు మరోసారి అవకాశం