రోడ్డును ఆక్రమించి..షెడ్డు నిర్మించి | - | Sakshi
Sakshi News home page

రోడ్డును ఆక్రమించి..షెడ్డు నిర్మించి

May 17 2025 7:13 AM | Updated on May 17 2025 7:13 AM

రోడ్డును ఆక్రమించి..షెడ్డు నిర్మించి

రోడ్డును ఆక్రమించి..షెడ్డు నిర్మించి

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ డివిజన్‌, షేక్‌పేట మండలం, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.78 నవ నిర్మాణ్‌నగర్‌ కాలనీ వెనక ఉన్న ప్రభుత్వ స్థలంలో..ఉమ్మడి ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో పని చేసే సిబ్బంది కోసం క్వార్టర్లు నిర్మించారు. సర్వే నెం.403లో ఒక్కొక్కరికి 50 గజాల చొప్పున ఈ క్వార్టర్స్‌ నిర్మాణం చేపట్టారు. 1999 ప్రాంతంలో చంద్రబాబు ఇంట్లో పని చేసే సిబ్బంది కోసం ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ స్థలంలోనే ఈ క్వార్టర్లు నిర్మించి ఇందులో ఆరుగురికి పట్టాలు కూడా ఇచ్చారు. మరో ఆరు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే చంద్రబాబు ఇంట్లో దోభీ, తోటమాలి తదితరులు ఖాళీగా ఉన్న ప్లాట్లలో ఉంటున్నారు. ప్లాట్‌ నెంబర్‌.1లో ఎలాంటి పట్టా లేకుండా సీహెచ్‌.మూర్తి అనే దోభీ కొంత కాలంగా అక్రమంగా నివసిస్తుండటమే కాకుండా..క్వార్టర్స్‌ ముందు రోడ్డును ఆక్రమించి షెడ్డు నిర్మించాడు. దీంతో స్థానికులు రాకపోకలు స్తంభించాయి. ఈ విషయమై కొంత కాలంగా పట్టాలు ఉండి అధికారికంగా ఉంటున్న వారికి, పట్టాలు లేకుండా ఖాళీ ప్లాట్లలో ఉంటున్న వారికి మధ్య రోడ్డు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇక్కడ సీవరేజి పైప్‌లైన్‌, మంచినీటి పైప్‌లైన్‌ మంజూరు కావడంతో పాటు జీహెచ్‌ఎంసీ రోడ్డు పనులు కూడా ప్రారంభించాల్సి ఉంది. అయితే దోభీ మూర్తి ఆక్రమించిన స్థలంలో షెడ్డు నిర్మాణం వీటికి అడ్డుగా ఉంది. సదరు షెడ్డును తొలగిస్తే పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణంపై స్థానికులు షేక్‌పేట తహసీల్దార్‌కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్‌ అనితారెడ్డి క్వార్టర్లను పరిశీలించారు. వారి వద్ద ఉన్న పట్టాలు, ఖాళీగా ఉన్న ప్లాట్లపై ఆరా తీశారు. రోడ్డు ఆక్రమించి షెడ్డు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని, అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు రెండు రోజుల గడువు ఇస్తున్నామని ఆమె హెచ్చరించారు. మరో వైపు పట్టాలు లేకుండానే కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వం నిర్మించిన ఈ క్వార్టర్లలో తిష్టవేసి వీటిని శాశ్వతంగా కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఈ విషయంపై స్పందించి అక్రమార్కులను ఖాళీ చేయించి క్వార్టర్స్‌ అన్యాక్రాంతం కాకుండా చూడటంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో సిబ్బందికి క్వార్టర్లు

వాటిలో తిష్టవేసిన అక్రమార్కులు

రెవెన్యూ అధికారుల పరిశీలన

అక్రమ నిర్మాణాలుతొలగించాలని ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement