 
															గ్రీన్‌ఫీల్డ్ పనులు అడ్డుకున్న రైతులు
ముత్తారం(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పోతారంలో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులను నిర్వాసిత రైతులు బుధవారం అడ్డుకున్నారు. వారంరోజులుగా తొమ్మిది మంది రైతులకు చెందిన వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించకుండానే పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ మధూసూదన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమకు జీవనాధారమైన భూములకు పరిహారం లెక్క తేల్చాకే పనులు చేయాలని నిర్వాసితులు తేల్చిచెప్పారు. సమస్యపై మంథని ఆర్డీవో సెల్‌ఫోన్‌లో బాధితులతో తహసీల్దార్ వివరించారు. పరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. ఎస్సై రవికుమార్, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
బూడిద పైపులైన్ పనుల అడ్డగింత
రామగుండం: ఎన్టీపీసీ ప్రభావిత మల్యాలపల్లిలో చేపట్టిన బూడిద పైపులైన్ పనులను గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. స్పందించిన అధికారులు వారితో సమావేశమయ్యారు. భూగర్భ డ్రైనేజీ, సీసీరోడ్లు, శ్మశానవాటిక, కమ్యూనిటీహాల్, సాగునీటి అవసరాల కోసం మత్తడి నిర్మాణం, విద్యుత్, సోలార్ కేంద్రాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పన తదితర సమస్యలపై అధికారులు హామీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా శ్మశానవాటిక నిర్మాణం పూర్తయ్యే వరకు ఎన్టీపీసీ రిజర్వాయర్ స్థలంలో అంత్యక్రియలు పూర్తిచేసేందుకు అనుమతించారని, రాజీవ్ రహదారి నుంచి జీరోపాయింట్ వరకు 20 అడుగులతో రోడ్డు విస్తరణ, వీధిదీపాల ఏర్పాటు తదితర పనులు చేపట్టేందుకు ఎన్టీపీసీ అధికారులు అంగీకరించారని గ్రామస్తులు పేర్కొన్నారు.
బంగారం దుకాణంలో చోరీ
జమ్మికుంట: జమ్మికుంటలో దొంగలు హల్చల్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఓ బంగారం దుకాణంతో పాటు, డిస్కౌంట్ మొబైల్ షాపుల షట్టర్లు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. టౌన్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ వద్దగల ఎస్‌ఎల్‌ఎస్ జువెల్లరీ షాపు, డిస్కౌంట్ మొబైల్ దుకాణం షట్టర్లు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. సెల్‌ఫోన్ దుకాణంలో ఎలాంటి వస్తువులు అపహరణకు గురికాలేదని, బంగారం దుకాణంలో 5 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
 
							గ్రీన్‌ఫీల్డ్ పనులు అడ్డుకున్న రైతులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
