నూతన జిల్లా ఏర్పాటులో దర్శికి అన్యాయం
దర్శి: నూతన జిల్లా ఏర్పాటులో దర్శి నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్.కరుణానిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతనంగా ఏర్పాటవుతున్న మార్కాపురం జిల్లాలో దొనకొండ, కురిచేడు మండలాలను కలపాలని డిమాండ్ చేశారు. దర్శిని మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో చేర్చితే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి మార్కాపురం జిల్లాకు ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. కురిచేడు మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని విన్నవించారు. వెలిగొండను త్వరితగతిన పూర్తి చేసి పశ్చిమ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని కోరారు. దర్శిని మార్కాపురం జిల్లాలో కలపాలని, ఇందుకోసం కలిసివచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో పోరాడతామని స్పష్టం చేశారు.
● రూ.1.10 లక్షల విలువైన సొత్తు
స్వాధీనం
ముండ్లమూరు(దర్శి): మండలంలోని సుంకరవారిపాలెం గ్రామంలో గునుపూడి సురేష్‌బాబు నివాసంలో వెండి వస్తువులు దొంగిలించిన వ్యక్తిని ముండ్లమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్సై కమలాకర్ వెల్లడించారు. చోరీ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం వేంపాడు గ్రామం మారెళ్ల రోడ్డులో అనుమానస్పదంగా తిరుగుతున్న ఆరవీటి కోటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి రూ.1.10 లక్షల విలువైన 2 వెండి కంచాలు, వెండి ప్లేటు, కలశం చెంబులు, వెండి మొలతాడు, కుంకుమ భరిణె, తాళాలగుత్తి, పొంగళిగిన్నెలు, గ్లాసులు, దీపం ప్రమిదలు, బత్తీల స్టాండ్‌లు, గంధం, కమలం గిన్నెలు, ఎనిమిది జతల పట్టీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు.
త్రిపురాంతకం: జాతీయ రహదారిపై సంభవించిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళా ఉద్యోగిని మృతి చెందింది. మండలంలోని సోమేపల్లి రోడ్డు సమీపంలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దూపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్న షేక్ హాబీబున్నీసా(30) అసిస్టెంట్ మేనేజర్ సాయికుమార్‌తో కలిసి త్రిపురాంతకం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్క నుంచి ఓ ముంగిస వేగంగా వచ్చి బైక్ చక్రాల మధ్య పడడంతో అదుపు తప్పింది. హబీబున్నీసా రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. ఆమెను త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైపాలెం తరలించగా అక్కడ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


