కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా జీజీహెచ్
● వైద్యశాఖ సమీక్షలో కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు టౌన్: నగరంలోని ప్రైవేట్, కార్పొనరేట్ ఆస్పత్రులకు దీటుగా జీజీహెచ్‌ను తీర్చిదిద్దాలని వైద్యశాఖ అధికారులను కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఆయన చాంబర్‌లో జీజీహెచ్ అభివృద్ధిపై వైద్యారోగ్య శాఖ, సర్వజన ఆసుపత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 85 శాతం నిరుపేద, సామాన్య ప్రజలు వైద్య చికిత్స కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వస్తుంటారన్నారు. వైద్యులు సానుకూలంగా స్పందిస్తే సగం రోగం నయమవుతుందని, రోగుల పట్ల ఆప్యాయతతో వ్యవహరించాలని సూచించారు. జీజీహెచ్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్కిటెక్ట్ సూచనల మేరకు అవసరమైన మేర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమీక్షలో జిల్లా రెవెన్యూ అఽధికారి చిన ఓబులేసు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం: మార్కాపురం జీజీహెచ్‌లో ఎస్‌ఎన్‌సీయూ(స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్)లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సీహెచ్ గౌతమ్‌రెడ్డి(28) సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పట్టణ, రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. శనివారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిసింది.


