కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం
ఒంగోలు టౌన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ అలుపెరుగని పోరాటాలు చేస్తోందని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు తెలిపారు. ఈ నెల 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభల పోస్టర్లను సోమవారం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులను తాకట్టుపెడుతోందని విమర్శించారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారన్నారు. వాటి ద్వారా కార్మికుల జీవితాలను దుర్భరం చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపేది కార్మికవర్గమేనని, కార్మికులను దెబ్బ తీస్తే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినట్టేనని చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణతో పాటు కార్మికులకు సంబంధించిన భవిష్యత్ పోరాట కార్యక్రమాల గురించి మహాసభలలో చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీవీ కొండారెడ్డి, పి.కల్పన, సీహెచ్ చిరంజీవి, పారా శ్రీనివాసరావు, కొర్నెపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


