
పేలిన గ్యాస్ సిలిండర్
● కర్రీస్ షాప్‌లో వంట సామగ్రి దగ్ధం
● తప్పిన పెను ప్రమాదం
పొదిలి: కర్రీస్ షాప్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంలో మంటలు ఎగసిపడి వంట సామగ్రి దగ్ధమైన సంఘటన పొదిలిలోని విశ్వనాథపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. దర్శి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. వివరాలు.. విశ్వనాథపురంలోని కాలేజీ రోడ్డు మొదటి లైనులో కూరలు, పాలు విక్రయించే దుకాణంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. అదృష్టవశాత్తూ సిలిండర్‌లో గ్యాస్ స్వల్పంగా ఉండటం, జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనంపై భాగంగా పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తుంటారు. అక్కడ కూడా ఎవరూ లేక పోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంత మేర ఆస్తినష్టం సంభవించిందని యజమాని బంకా అనంతరావు చెప్పారు. రెగ్యులేటర్ ఆపకపోవడం, నాణ్యతలేని పైపును వాడటం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మూలంగానే ప్రమాదం చోటుచేసుకుందని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొన్నారు.
నగల దుకాణంలో మహిళ చేతివాటం
మార్కాపురం: పట్టణంలోని ఓ నగల దుకాణంలో మహిళ చేతివాటం చూపి ఆభరణాలు అపహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టణంలోని చెన్నకేశవ స్వామి గుడి సమీపంలోని బంగారు నగల వీధిలోని ఓ దుకాణానికి మహిళలు వెళ్లారు. ఈ సమయంలో ఓ మహిళ దుకాణ యజమానిని ఏమార్చి ఆభరణం దొంగిలించి వెళ్లిపోయింది. సీసీ ఫుటేజీలో ఆలస్యంగా చోరీ విషయాన్ని గుర్తించిన షాపు యజమాని సదరు మహిళలను నిలదీశారు. దీంతో వారు తమ తప్పు ఒప్పుకొని ఆ ఆభరణాన్ని వెనక్కి ఇచ్చారు.