
భక్తాళాపురంలో షర్మిలకు హారతితో స్వాగతం పలుకుతున్న మహిళలు
పెన్‌పహాడ్: సీఎం కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేయడంలో దిట్ట అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నా రు. ఆదివారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పరిధిలోని భక్తాళాపురం, యర్రంశెట్టిగూడెం, భాగ్యతండా గ్రామాల్లో నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె మాట్లాడారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఏఒక్కహామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. నిరుద్యోగుల ప్రాణాలంటే సీఎం కేసీఆర్‌కు లెక్కలేదన్నారు.
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పో యిందని, వారికి రక్షణ కల్పించడంలో విఫలమైన కేసీఆర్ ఉరివేసుకొని చనిపోవాలని పేర్కొన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. చివరికి బీజేపీ దేశాన్ని రక్షించే ఆర్మీని సైతం కాంట్రాక్ట్ పద్ధతికి తీసుకువచ్చిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జులు ఏపూరి సోమన్న, పచ్చిపాల వేణుయాదవ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జేవీఆర్ తదితరులు పాల్గొన్నారు.