
సిరిసిల్ల: కొట్లాడి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుల ప్రయోజనాలకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోరని, కేంద్రం దిగి వచ్చేదాకా ఉద్యమిస్తారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. దేశాన్ని 75 ఏళ్లుగా ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పీకింది ఏంటీ.. అని ప్రశ్నించారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచిక)లో మన దేశం 101వ ర్యాంకులో ఉంటే, మనకంటే చిన్న దేశాలైన పాకిస్తాన్ 92వ ర్యాంకులో, నేపాల్, బంగ్లాదేశ్‌లు 76 ర్యాంకుల్లో ఉన్నాయని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పాలన సిగ్గు చేటని పేర్కొన్నారు. రైతుల ఉత్సాహం చూస్తుంటే రాష్ట్ర సాధన ఉద్యమం గుర్తుకు వస్తోందన్నారు. యాసంగి వడ్లను కొనబోమన్న కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రైతు మహాధర్నాను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
పేదరికంపై సోయి లేదు: దేశంలో సాగుకు యోగ్యమైన 40కోట్ల ఎకరాల భూములున్నాయని, 65 వేల టీఎంసీల నీరుందని, సాగుకు, తాగునీటికి ఎంత వాడుకున్నా.. 35 వేల టీఎంసీలకు మించదని మంత్రి వెల్లడించారు. ఇంత సారవంతమైన భూములున్నా, మంచి వాతావరణం ఉన్నా, దేశంలో పేదరికం పోలేదని కేటీఆర్ విమర్శించారు. దేశాన్ని నడిపేవాళ్లకు ఆ సోయి లేదని అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, ఆ విషయం గూగుల్‌లో చూస్తే తెలుస్తుందని చెప్పారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యలు తగ్గిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు.
కేంద్రం కొంటానంటే వద్దంటున్నామా?: కేంద్రం యాసంగి వడ్లు కొనబో మని చెబితే.. ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ కేంద్రమంత్రులను కలిసి బాయిల్డ్ వడ్లు కొనాలని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. అయినా కేంద్ర వైఖరి మారకపోవడంతో యాసంగిలో వరి వద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారని.. వెంటనే తొండి సంజయ్ వడ్లు ఎట్ల కొనరో చూస్తానని అన్నారని మంత్రి చెప్పారు. కేంద్రం వడ్లు కొం టామంటే మేం వద్దంటున్నామా..? అని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏం అభివృద్ధి సాధించాడో చెప్పాలని అన్నారు.
రైతులకు తెలంగాణలో నీళ్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, పెట్టుబడికి పైసలిచ్చి, సమయానికి ఎరువులు, విత్తనాలు ఇచ్చి.. రైతుకు ఆపద వస్తే బీమా కల్పించి ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ రైతుల కుటుంబాలకు అండగా ఉంటున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ అంటే.. తెలంగాణ రైతు సమితి అని కేటీఆర్ అన్నారు. రైతులు కన్నెర్ర చేస్తే.. రైతుల ఎడ్ల బండి కింద బీజేపీ నలిగిపోతుందన్నారు. కేంద్రమంత్రి కొడుకు కారుతో రైతులను తొక్కించి 8 మందిని చంపితే.. ప్రధాని సంతాపం కూడా చెప్పలేదని విమర్శించారు.