
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘సీఎం కేసీఆర్‌కు ఫక్తు రాజకీయాలు చేయడమే పని.. నిత్యం కేంద్రాన్ని, ప్రధానిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అభివృద్ధి జరిగితే కేంద్రానికే పేరొస్తుందనే అక్కసుతో జాప్యం చేస్తున్నారు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌తో కలిసి సంజయ్ మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చారు. అక్కడ బీజేపీ పదాధికారుల సమావేశానికి హాజరయ్యారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలను నేతలకు వివరించారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై చర్చించారు. వాటిని మంగళవారం జరిగే రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఆమోదించనున్నారు. అంతకుముందు జడ్చర్ల– మహబూబ్‌నగర్ రహదారిలో అప్పనపల్లి వద్ద ఆర్వోబీ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు.
ఆర్వోబీకి కేంద్రం నిధులు మంజూరు చేసినా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఒప్పందానికే పరిమితమైందని.. మ్యాచింగ్ గ్రాంట్ నిధులను ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు. రేషన్ బియ్యం, మరుగుదొడ్లు, పల్లె ప్రకృతి వనాలు, రైతువేదికల నిర్మాణం కోసం కేంద్రమే నిధులిస్తున్నా.. కేసీఆర్ బొమ్మలు పెట్టుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
నేడు రాష్ట్ర కార్యవర్గ భేటీ
మహబూబ్‌నగర్ భగీరథకాలనీ సమీపంలోని అన్నపూర్ణ గార్డెన్‌లో మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఉదయం పది గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. సమావేశంలో 9 అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఇతర నేతలు హాజరుకానున్నారు.