BBC Documentary Row: 'చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం'

Bjp Mp Alleges China Funding Bbc Propaganda On Pm Modi - Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన సంస్థ నుంచి డబ్బులు తీసుకునే ప్రధాని మోదీపై బీబీసీ తప్పుడు డాక్యుమెంటరీని రూపొందించిందని బీజేపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలాని ఆరోపించారు. హూవావే సంస్థ నుంచి బీబీసీకి డబ్బులు అందాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

'బీబీసీ ఎందుకు భారత్‌కు వ్యతిరేకం? ఆ సంస్థకు బాగా డబ్బు అవసరమైంది. చైనాకు చెందిన హువావే సంస్థ ఆ డబ్బును సమకూర్చింది. డబ్బు తీసుకుని కావాలనే బీబీసీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీబీసీ అమ్ముడుపోతోంది.' అని మహేష్ జెఠ్మాలని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి బ్రిటన్ మేగజీన్ 'ది స్పెక్టేటర్' 2022 ఆగస్టులో ప్రచురించిన ఓ కథనాన్ని కూడా షేర్ చేశారు.

బీజేపీ నేత అమిత్ మాలవీయ సైతం బీబీసీ డాక్యుమెంటరీ దురుద్దేశంతో ఉందని ఆరోపించారు. భారత్ వృద్ధికి ఆటంకం కల్గించేందుకే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. చైనా ప్రభుత్వం అండదండలతో కొన్ని సంస్థలు బీబీసీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, రెండేళ్లుగా డబ్బులు అందిస్తున్నాయని అన్నారు. ఈ డాక్యుమెంటరీని ప్రతిపక్షాలు కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని పేర్కొన్నారు.

కార్తీ చిదంబరం సెటైర్లు..
మరోవైపు బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సెటైర్లు వేశారు. కేంద్రం బీబీసీ డాక్యమెంటరీని బ్యాన్ చేయడం చిన్నపిల్లల మనస్తత్వాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒకవేళ బీజేపీ నేతల దగ్గర బలమైన ఆధారాలుంటే బ్రిటన్‌లో ఆ సంస్థపై ఫిర్యాదు చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు.

డాక్యుమెంటరీలో వాస్తవం లేదని ప్రభుత్వం భావిస్తే అసలు నిజాలేంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయకుండా బ్యాన్ ఎందుకు చేశారని అడిగారు. బీజేపీ నేతలు నిజంగా చైనా గురించి మాట్లాడాలనుకుంటే సరిహద్దులో చొరబాట్లు గురించి చర్చించాలన్నారు.
చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top