
చికిత్స పొందుతూ యువకుడి మృతి
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన యువకుడు జి.రాకేష్(20) వ్యసనాలకు బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొద్దాం గ్రామానికి చెందిన జి.రాకేష్ తండ్రి వెంకటసత్యం ఎస్.కోట సర్కిల్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ పదినెలల క్రితం విద్యుత్‌ఘాతంతో మరణించారు. అప్పటినుంచి రాకేష్ వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ నెల 11న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబసభ్యులు ఎస్.కోట సామాజిక ఆసుత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరంలోని మహారాజా ఆస్పత్రిలో చేర్చారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తల్లి పార్వతి కారుణ్య నియామకంపై కొత్తవలసలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యాన్ ఢీకొని యువకుడి మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని రావికోన పంచాయతీ రంగాలగుడ గ్రామంలో వివాహానికి హాజరైన ఒడిశాకు చెందిన ముగ్గురు యువకుల్లో ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ దుర్ఘటన వివరాలిలా ఉన్నాయి. పెళ్లికి వెళ్లిన యువకులు ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా రంగాలగూడ గ్రామం మలుపు వద్ద ఒడిశా నుంచి ఎదురుగా వస్తున్న పౌల్ట్రీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న యువకులు రోడ్డుపై పడిపోగా తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు హుటాహుటిన పార్వతీపురం కేంద్రాస్పత్రికి 108 సాయంతో తరలించగా మార్గమధ్యంలో కండ్రిక నారు అనే వ్యక్తి మృతిచెందాడు. మరో ఇద్దరు యువకులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురి యువకులను ఒడిశాలోని అలమండ పంచాయతీ జగ్గుగూడ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.