
పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: మూడేళ్ల క్రితం విజయనగరం టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి ఉమామహేశ్వరరావుకు (20) 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పు వెల్లడించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే..విజయనగరంలో 9వతరగతి చదువుతున్న బాలికతో శ్రీకాకుళం జిల్లా గార మండలం దీపావళి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి బాలికను లోబరుచుకుని శ్రీకాకుళం తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై 2023లో సదరు బాలిక తల్లిదండ్రులు విజయనగరం టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ లక్ష్మణరావు పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే అప్పటి విజయనగరం దిశ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడు ఉమామహేశ్వరరావుపై చేసిన నేరారోపణలు రుజువు కావడంతో పోక్సో జడ్జి పై విధంగా తీర్పు ఇచ్చినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి రూ.2లక్షలు పరిహారంగా ఇప్పించాలని జడ్జి తీర్పు వెల్లడించారన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ప్రాసిక్యూటర్ మెట్ట ఖజానారావు వాదనలు వినిపించగా కోర్టు కానిస్టేబుల్ లక్ష్మి, సీఎంఎస్ హెచ్‌సీ రామకృష్ణ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బందిని, తమ శాఖ సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.