
ఎస్పీని కలిసిన ప్రొబేషనరీ ఎస్సైలు
పార్వతీపురం రూరల్: జిల్లాకు శిక్షణ నిమిత్తం కేటాయించిన 38మంది ప్రొబేషనరీ ఎస్సైలు గురువారం జిల్లా పోలీస్‌శాఖ కార్యాలయంలో ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో ఎస్పీ వారికి విధి నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. పోలీసు శాఖలో అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్సైలను ముందుగా ఎస్పీ అభినందించారు. క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లకు శిక్షణ నిమిత్తం వారికి కేటాయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమ శిక్షణగా నిజాయితీతో పారదర్శకంగా జవాబుదారీతనం పాటిస్తూ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి పోలీసుశాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని కోరారు. కేటాయించిన పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలను తరచూ సందర్శిస్తూ ముఖ్యంగా ఏఓబీ ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. వారికి సైబర్, నక్సలిజం, మత్తు పదార్థాలు, సారా వల్ల కలిగే దృష్ప్రబావాల గురించి అవగాహన కల్పించాలని చెప్పారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై
అవగాహన అవసరం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పరిధిలో గల పోలీస్ స్టేషన్‌లలో నిర్వర్తించాల్సిన విధి విధానాలపై ఎస్పీ క్షుణ్ణంగా వారికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా జిల్లాను ఆనుకుని ఉన్న ఏజెన్సీ ప్రాంతాలను తరచూ సందర్శిస్తూ అక్కడి ప్రజలతో సమావేశమై, మమేకమై వారి ద్వారా సరైన సమాచారాన్ని సేకరించి కూంబింగ్ ఆపరేషన్ల గురించి తెలుసుకుని, నిర్వహిచాలని చుట్టుపక్కల ఏజెన్సీ ప్రభావిత ప్రాంతాలలో సంచరించే దళాల గురించి, వారికి సాయం చేసే వారిగుంచి వివరాలు సేకరించాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్‌డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన ప్రొబేషనరీ ఎస్సైలు