
పోలీసుల తీరు అభ్యంతరకరం
● అధికారం శాశ్వతం కాదు.. ● మాజీ మహిళా మంత్రి రజని పట్ల ఇలానే వ్యవహరిస్తారా..! ● రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు నిబంధనలు అతిక్రమిస్తున్నారు.. ● భవిష్యత్‌లో చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు ● మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
సాలూరు: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండిపోదనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. మాజీ మహిళా మంత్రి విడదల రజని పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత ఆక్షేపనీయంగా ఉందని తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో ఆయన ఆదివారం మాట్లాడారు. ఓ మహిళ, మాజీ మంత్రి అయిన విడదల రజని పట్ల పోలీసులు అత్యంత అభ్యంతరకరంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో కొందరు పోలీసులు తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. పోలీసులు తమ నిబంధనలను అతిక్రమిస్తున్నారని హైకోర్టు కూడా ఆగ్రహించిన సంఘటనలు రాష్ట్రంలో నేటి పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. ఎన్టీ రామారావు వంటి వ్యక్తే అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒకప్పుడు ఓడిపోయిన పవన్‌కల్యాణ్ నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించాలని సూచించారు. భవిష్యత్‌లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందనే భ్రమలో కొందరు పోలీసులు నిబంధనలను అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా తాను పని చేసిన కాలంలో ఏనాడూ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లమని పోలీసులకు చెప్పలేదని గుర్తు చేశారు. నేటి రెడ్ బుక్ రాజ్యాంగంలో నిబంధనలు అతిక్రమిస్తున్న అధికారులు, పోలీసులు భవిష్యత్‌లో చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.