యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం

May 11 2025 12:40 PM | Updated on May 11 2025 12:40 PM

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం

రామభద్రపురం: యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. మండలంలోని కొట్టక్కి రెవెన్యూ పరిధిలోని మిర్తివలస మధుర గ్రామం కాకర్లవలస వద్ద ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే బేబీనాయన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులతో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఎకరాలలో రూ.7 కోట్లతో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం రాష్ట్రంలో రానున్న రెండేళ్లలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నమన్నారు. ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ పారిశ్రామిక రంగంలో కొత్త విధానమని, తక్కువ మొత్తానికే చిన్న పారిశ్రామిక వేత్తలకు లీజుకు ఇస్తామని తెలిపారు. దీని కోసం 95 శాతం రుణాలు ఎటువంటి ఆస్తుల గ్యారంటీ చూపకుండా మంజూరు చేసేలా బ్యాంకర్లకు ప్రభుత్వం సుమారు రూ.150 వేల కోట్లు అందజేసిందన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రతి కుటుంబ నుంచి ఒక వ్యాపారవేత్త రావాలని పిలుపునిచ్చారు. రామభద్రపురం అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్‌ కోసం శీతల గోదాం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. బుడాచైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు అప్పికొండ సరస్వతి, ఆర్డీవో రామ్మోహనరావు, తహసీల్దార్‌ సులోచనరాణి, ఎంపీడీవో రత్నం తదితరులు పాల్గొన్నారు.

ట్రేడింగ్‌ పేరిట నయా మోసం

సైబర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేసిన

బాధిత మహిళ

పార్వతీపురం రూరల్‌: మండలంలోని పుట్టూరు గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి ట్రేడింగ్‌ పేరిట సైబర్‌ మోసానికి గురైనట్లు శనివారం పార్వతీపురం రూరల్‌ ఎస్‌ఐ బి.సంతోషికుమారి పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌ నెలలో బాధిత మహిళ ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ మేరకు అరోరా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట పెట్టుబడులు పెడితే ప్రోత్సాహకాలు నగదు రూపంలో వస్తాయని నమ్మించారు. బాధిత మహిళ ఆశపడి ఏడాది కాలంలో రూ.67,500లు పెట్టుబడి పెట్టగా నెలలు గడుస్తున్నా తనకు చెప్పిన ప్రకారం ప్రోత్సాహక నగదు చెల్లించకపోవడంతో ట్రేడింగ్‌ సిబ్బందిని ప్రశ్నించారు. వారు తప్పించుకొనే ప్రయత్నంలో భాగంగా సంబంధించిన గ్రూపుల నుంచి బాధిత మహిళను తొలగించడంతో మోసానికి గురైనట్టు గమనించిన బాధితురాలు సైబర్‌ పోర్టల్‌ 1930 నంబరుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సంతోషి మాట్లాడుతూ అవగాహన లేకుండా గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్‌లకు, లింక్‌లకు స్పందించవద్దని, స్పందించిన కారణంగా సైబర్‌ మోసానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.

గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్‌

నెల్లిమర్ల రూరల్‌: మండలంలోని మొయిద విజయరామపురం గ్రామ సమీపంలోని ఉన్న చంపావతి నదీ తీరంలో గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవిస్తున్నట్టు అందిన ముందస్తు సమాచారంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని ఎస్‌ఐ గణేష్‌ తెలిపారు. నదీ తీరంలో తుప్పల చాటున గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను అరెస్ట్‌ చేసి వారి నుంచి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అందరూ చదువుకున్న వారేనని, ఒడిశా రాష్ట్రంలోని రాయఘడ రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. కాలేజీ చదువుతున్న సమయంలో చెడు అలవాట్లకు లోనై గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నారని తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement