
నెల్లిమర్లలో టీడీపీ x బీజేపీ
● చిచ్చు రేపిన అన్న క్యాంటీన్ వ్యవహారం
● ఇటీవల లోపాలు ఎత్తిచూపిన బీజేపీ నేతలు
● మండిపడ్డ టీడీపీ శ్రేణులు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
నెల్లిమర్ల రూరల్: నెల్లిమర్ల కూటమిలో ఊహించని రీతిలో చిత్ర విన్యాసాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ–జనసేన మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. తాము అనుకున్నట్టు ఏదీ జరగడం లేదని టీడీపీ నేతలు తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఈ మధ్యనే బీజేపీ నేతలు కూడా టీడీపీపై యుద్ధం ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల కోపం కట్టలు తెంచుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇటీవల నెల్లిమర్ల మండల కేంద్రంలో ఉన్న అన్న క్యాంటీన్‌లో నిర్వహణ సక్రమంగా లేదంటూ వైఎస్సార్‌సీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన కౌన్సిలర్ మైపాడ ప్రసాద్ ఆరోపిస్తూ కొంతమంది జనసేన, బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అన్న క్యాంటీన్‌లో అవకతవకలు జరుగుతున్నాయని, పేదలకు అందాల్సిన ఆహారం పక్కదారి పడుతోందని ఆరోపించారు. అయితే ప్రజా సమస్యలపై ఇలానే పోరాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ కౌన్సిలర్ ప్రసాద్‌ను ప్రోత్సహించడంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారని, వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
క్షమాపణలు చెప్పాలి..
నెల్లిమర్లలో అరాచక శక్తులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ ప్రోత్సహించడం సరికాదని టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బీజేపీ నేతలకు వ్యతిరేకంగా శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వహిస్తోందని బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవమన్నారు. ఆరోపణలు చేసిన నాయకుడి పూర్వపరాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు తెలుసుకోవాలని హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం పొత్తు ధర్మాన్ని విస్మరిస్తూ అవాకులు, చెవాకులు మాట్లాడడం సరికాదని, క్షేత్ర స్థాయిలో నిజాలు తెలుసుకోకుండా సదరు నాయకుడిని ఎలా ప్రోత్సహిస్తారని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన బీజేపీ నాయకుడిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ప్రోత్సహించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు అవనాపు సత్యన్నారాయణ, కింతాడ కళావతి, బైరెడ్డి నాగేశ్వరరావు, రెడ్డి వేణు, కాళ్ల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.