
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
● తొమ్మిది బైక్‌ల స్వాధీనం
● నెల్లిమర్లలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు
నెల్లిమర్ల రూరల్: వాళ్ల కన్నుపడితే చాలు ఏ బండైనా క్షణాల్లో మాయమవ్వాల్సిందే. బైకు చోరీలకు పాల్పడడం.. మీ సేవ సహకారంతో ఆన్‌లైన్‌లో లేని నంబర్లను వెతికి నంబరు ప్లేట్లను మార్చడం.. వీళ్లకి వెన్నతో పెట్టిన విద్య. అలా నంబరు ప్లేట్లను మార్పు చేసి అతి తెలివిగా బంధువులకు, స్నేహితులకు తక్కువ సొమ్ముకే తనఖాకు పెట్టి జల్సాలు చేయడం వాళ్లకి నిత్యకృత్యం. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, కశింకోట ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో బైక్ చోరీలకు పాల్పడ్డారు. అనుమానం రాకుండా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును నెల్లిమర్ల పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. చోరీలకు పాల్పడుతున్న నెల్లిమర్ల మండలం పెద్ద బూరాడపేట, చిన్న బూరాడపేట గ్రామాలకు చెందిన ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల ఎస్‌ఐ గణేష్ తన సిబ్బందితో కలిసి బూరాడపేట జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అదే సమయంలో పెద, చిన బూరాడపేట గ్రామాలకు చెందిన బెల్లాన చంద్రశేఖర్, దన్నాన సూరిబాబు ద్విచక్ర వాహనంపై వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తొలుత రెండు బైకులను చోరీ చేసినట్లు అంగీకరించారు. ఇటీవల ద్విచక్ర వాహనాలు మాయమవుతున్నట్టు ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా నెల్లిమర్ల మండల పరిధిలో 2, గజపతినగరం పరిధిలో 1, విజయవాడ సిటీ పరిధిలో 4, గుర్ల పరిధిలో 1, కశింకోట పరిధిలో ఒకటి చొప్పన మొత్తం 9 బైకులను చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలను రికవరీ చేసి ఇద్దరి నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించి నిబంధనల ప్రకారం బాధితులకు వాహనాలు అప్పగిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని ఆయన అభినందించారు. సీఐ జి.రామకృష్ణ పాల్గొన్నారు.