అవ్వాతాతలకు నేత్ర పరీక్షలు

వైద్యశిబిరాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌ఓ  - Sakshi

● జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జగన్నాథరావు

పార్వతీపురం టౌన్‌: డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయాల పరిధిలోని అవ్వాతాతలకు నేత్ర పరీక్షలు చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జగన్నాథరావు తెలిపారు. జిల్లా కంటి వెలుగుసెల్‌ నేత్ర వైద్యాధికారి జీరు నగేష్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వెంకమ్మపేటలో శనివారం నేత్రవైద్య శిబిరం నిర్వహించారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ నేత్ర పరీక్షలు చేశారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించారు. వచ్చేనెల 14న పుష్పగిరి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేస్తామని డీఎంహెచ్‌ఓ తెలిపారు. రవాణా, మందులు, భోజనం, వసతి, కళ్ల జోళ్లు తదితర సేవలన్నీ ఉచితంగానే అందజేస్తామన్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రొగ్రాం అధి కారి డా.సుకుమార్‌బాబు మాట్లాడుతూ 60 ఏళ్లు వయస్సు దాటిన వారందరూ నేత్ర పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా అంధత్వం రాకుండా కంటి చూపును కాపాడుకోవాలని కోరారు. శిబిరానికి వచ్చిన వృద్ధులకు జిల్లా కంటి వెలుగు అధికారి డాక్టర్‌ సుకుమార్‌బాబు నేత్రపరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త వెంకటరత్నం పాల్గొన్నారు.

వాటర్‌ షెడ్‌ పనుల పరిశీలన

గుమ్మలక్ష్మీపురం: గ్రామాల్లోని రైతులకు ప్రయోజనకరంగా వాటర్‌షెడ్‌ పనులు చేపడుతున్నామని పార్వతీపురం ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్‌ అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎస్‌.కె.పాడు ఉద్యానవన నర్సరీ కేంద్రంలో చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. చెరువుగట్టు బలోపేతం పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. జె.కె.పాడు గ్రామస్తులకు వాటర్‌షెడ్‌ పథకం పనుల ప్రయోజనం వివరించారు. ఐటీడీఏ ద్వారా ఆయిల్‌ ఇంజిన్లు, టార్పాలిన్లు సరఫరా చేయాలంటూ గ్రామస్తులు అందజేసిన వినతులు స్వీకరించారు. జీసీసీ సూపర్‌బజార్‌ను సందర్శించి జీసీసీ వస్తువుల విక్రయాలపై ఆరాతీశారు. టిక్కబాయిలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆయన వెంట టీడబ్ల్యూఈఈ జె.శాంతీశ్వరరావు ఉన్నారు.




 

Read also in:
Back to Top