
● ఈ నెల 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ● ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు గడువు ● అర్హులైన బాలికలకు 6వ తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు ● 14 కేజీబీవీల్లో 1196 సీట్ల భర్తీకి నోటిఫికేషన్
పార్వతీపురం టౌన్: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) బాలికలకు ఆహ్వానం పలుకుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, 7, 8, 9 తరగతుల్లోని మిగుల సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆసక్తిగల బాలికలు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలోని 15 మండలాలకు గాను 14 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియంలో ఆరవ తరగతిలో ఒక్కో పాఠశాలకు 40 చొప్పున మొత్తం 560 సీట్లు భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు సంబంధించి 560 సీట్లకు, 7,8,9 తరగతిలో మిగులు సీట్లు 76 మొత్తం 1196 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. పేద, అనాథ పిల్లలతో పాటు బడిబయట ఉన్న పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
దరఖాస్తు చేసుకోవాలి
ఆరవ తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వం లేదా ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదివిన బాలికలు, ఇంటర్మీడియట్‌కు పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థినులు అర్హులు. హెచ్‌టీటీపీ://ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐన్// వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 14 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్య అందుబాటులో ఉంది.
గుమ్మలక్ష్మీపురం కస్తూర్బా విద్యాలయం
మంచి అవకాశం
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో మొత్తం 1196 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాం. ఈ ఏడాది నుంచి పూర్తిగా ఆంగ్లమాధ్యమంలోనే బోధన కొనసాగుతుంది. కేజీబీవీల్లో వసతి, భోజన సదుపాయంతో కూడిన విద్య అందుతుంది. బాలికలకు ఇది చక్కని అవకాశం. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి.
–ఎస్‌డీవీ రమణ,
డీఈఓ, సమగ్రశిక్ష ఏపీసీ, పార్వతీపురం మన్యం

కస్తూర్బా విద్యాలయం పాలకొండ
