మూడో విడత..

- - Sakshi

ముచ్చటగా..

పార్వతీపురంటౌన్‌/పార్వతీపురం: రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. మహిళల ఆర్థికోన్నతి కోసం పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాల మొత్తాన్ని వైఎస్సార్‌ ఆసరా పథకం కింద అందజేస్తోంది. ఇప్పటికే రెండు విడతల సాయం అందించగా... మూడో విడత నిధులవిడుదల కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శనివారం శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ ఆసరా కింద మూడో విడతలో పార్వతీపురం మన్యం జిల్లాలోని 16,646 స్వయం సహాయక సంఘాలకు చెందిన 1,83,077 మంది సభ్యుల ఖాతాలకు రూ.94.18 కోట్ల ఆసరా నిధులను జమచేశారు. వర్చువల్‌ విధానంలో జరిగిన వైఎస్సార్‌ ఆసరా నిధుల విడుదల కార్యక్రమాన్ని కలెక్టర్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు, కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ తదితరులు తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మూడోవిడత ఆసరా కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గంలో 4,127 సంఘాలకు చెందిన మహిళలకు రూ.21.02 కోట్లు, పాలకొండ నియోజక వర్గంలో 4,506 సంఘాలకు చెందిన మహిళలకు రూ.30.07 కోట్లు, పార్వతీపురం నియోజక వర్గంలోని 4,428 సంఘాలకు చెందిన మహిళలకు రూ.26.45 కోట్లు, సాలూరు నియోజకవర్గంలోని 3,585 సంఘాలకు చెందిన మహిళలకు రూ.16.64 కోట్ల నిధులు విడుదలైనట్టు వెల్లడించారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ మహిళల అభివృద్ధితో రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతోనే ఆర్థిక, రాజకీయ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారన్నారు. పేదల ఆర్థిక ఉన్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. మహిళలందరూ జగన్‌మోహన్‌రెడ్డికి అండదండలు అందించాలని, అభిమానం చూపాలని కోరారు. ఈ సందర్భంగా నమూనా చెక్కును కలెక్టర్‌తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆసరా పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మజ్జి శోభారాణి, జెడ్పీటీసీ సభ్యురాలు బలగ రేవతమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెకక్టు డైరెక్టర్‌ పి.కిరణ్‌కుమార్‌, టీపీఎంయూ ఏపీడీ వై.సత్యంనాయుడు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

పదిరోజుల పాటు...

ఆదివారం నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు పది రోజులపాటు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ, మండల స్థాయిలో ఆసరా సంబరాలు నిర్వహిస్తామని అధికార యంత్రాంగం పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఆసరా లబ్ధిని అందిస్తామని వెల్లడించింది. నియోజవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆసరా సంబరాలు జరగనున్నాయని, మండల స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారుల సమక్షంలో జరిగే కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యేలు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొంది.




 

Read also in:
Back to Top