టెక్నాలజీతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న డాక్టర్‌ ప్రభాత్‌కుమార్‌ - Sakshi

● కార్పొరేట్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ ప్రభాత్‌కుమార్‌ ● జీఎంఆర్‌ ఐటీలో సిల్వర్‌జూబ్లీ వేడుకలు

రాజాం సిటీ: విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఉంటుందని కార్పొరేట్‌ కన్సల్టెంట్‌, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్‌ ప్రభాత్‌కుమార్‌ అన్నారు. జీఎంఆర్‌ ఐటీలో శనివారం నిర్వహించిన సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన లక్ష్యాల వైపు పయనించాలని అన్నారు. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా గతాన్ని మర్చిపోకూడదని తెలిపారు. ప్రతిభను పెంపొందించుకునేందుకు విదేశాలకు సైతం వెళ్లాలని సూచించారు. సొంత ఆలోచనా శక్తితోనే మంచి వ్యవస్థ స్థాపించి పది మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్‌ మాట్లాడుతూ కళాశాలకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ గుర్తింపుతో దేశంలోనే 188వ ర్యాంకు రావడంతో పాటు నాక్‌–ఏ గ్రేడు, 5యూజీ ప్రొగ్రామ్స్‌ ఎన్‌బీఏ గుర్తింపు పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లో వివిధ క్రీడల్లో రాణించిన విద్యార్థులను సత్కరించారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు, నగదు ప్రోత్సాహకాలు అందించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో గొలివే గేమ్స్‌ గ్రూపు సీఈఓ పి.రవికిరణ్‌, ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె.గిరీష్‌, సీఈఓ ఎల్‌ఎం లక్ష్మణమూర్తి, గ్రంథి నీలాచలం, విద్యార్థులు, వివిద విభాగాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top