ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధంకండి

హాజరైన పదో తరగతి విద్యార్థులు - Sakshi

విజయనగరం: విద్యార్థులు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో పదో తరగతి పరీక్షలకు సిద్ధం కావాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు రాయడంపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని సుజాత కన్వెన్షన్‌ హాలులో శనివారం అవగాహనా సదస్సును నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం ఒక కొత్త ఒరవడిగా పేర్కొన్నారు. దీనిని ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ విద్యా కమిటీని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. విద్య కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, సమస్తమూ ప్రభుత్వమే అందిస్తోందని చెప్పారు. చక్కని విద్యను అందించడంతో పాటు, మంచి పోషక విలువలతో కూడిన రుచికరమైన భోజనాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల, బడి పిల్లలంతా శతశాతం భోజనం చేస్తున్నారని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కళ్ల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి, తమపై తల్లితండ్రులు, గురువులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు.

కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ కాలం విలువను తెలుసుకోవడం విజయానికి మేలైన మార్గమని పేర్కొన్నారు. దీనిని గుర్తించగలిగితే, సగం విజయాన్ని సాధించినట్టేనని అన్నారు. ప్రతీ విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా ఏకాగ్రతను అలవర్చుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలని, బాలికలు కూడా చిన్నవయసులోనే పెళ్లి జోలికి పోకుండా కనీసం డిగ్రీ వరకు చదువుకొని, ముందుగా తమ కాళ్లమీద తాము నిలబడేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ కోరారు. మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థులు ప్రశాంతతను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిప్యుటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకొనే వయసులో కష్టపడితే, జీవితంలో సుఖఃపడతారని అన్నారు. ఈ పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి రూ.25వేలు, రెండో విద్యార్థికి రూ.15వేలు, మూడో విద్యార్థికి రూ.10వేలు నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. సదస్సులో డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి, ఉప విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు, డైట్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.తిరుపతినాయుడు, విద్యా కమిటీ సభ్యులు సంతోషికుమారి, బి.పద్మావతి, టి.సంధ్యారాణి, పార్టీ నాయకులు ఆశపు వేణు, ఉపన్యాసకులు రవి కె.మండా తదితరులు పాల్గన్నారు.

డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

పదో తరగతి విద్యార్ధులకు

అవగాహనా సదస్సు




 

Read also in:
Back to Top