లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
నరసరావుపేట ఈస్ట్: కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వి.రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు పంచిపెడుతున్నారని విమర్శించారు. కార్మికులు ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయాలని చూడటం దారుణమన్నారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రాధాకృష్ణ మాట్లాడుతూ గిట్టుబాటు ధర లేకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్టు ఉన్నాయని అన్నారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రాము, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్.సుభానీ తదితరులు పాల్గొన్నారు.


