మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత
పిడుగురాళ్ల రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి బైపాస్ పక్కన నిర్మిస్తున్న మెడికల్ వైద్య కళాశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటు పీపీపీ పద్ధతిలో కాకుండా ఇటు ప్రభుత్వం ప్రారంభించకుండా డోలాయమానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి ఇది ఒక చాలెంజ్ అని కళాశాలను పూర్తిచేసి నిబద్ధత, నిజాయతీ నిరూపించుకోవడానికి ఒక పరీక్ష అని పేర్కొన్నారు. నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన మెడికల్ సీట్లు తీసుకువస్తే వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యార్థులకు వైద్య, విద్య దక్కుతుందని వివరించారు. పల్నాడు ప్రాంత ప్రజలకు మెడికల్ కళాశాల వర ప్రసాదమని తెలిపారు. విద్యార్థులతో కళకళలాడాల్సిన కళాశాల సంవత్సర కాలంగా ఆగిపోయి ఎడారిలాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య , పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శ వర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్ రెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె ఉమశ్రీ , నాయకులు తెలకపల్లి శ్రీనివాసరావు, భక్తులు వెంకటేశ్వర్లు, సంపత్ వెంకటకృష్ణ, మద్దిరాల నాగేశ్వరరావు, షేక్ బాషా పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు


