ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు మంగళవారం కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, వర్సిటీ రెక్టార్ ఆచార్య రామినేని శివరామప్రసాద్ ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో రాణించే విద్యార్థులు చదువులోనూ ముందుంటారని పేర్కొన్నారు. రెక్టార్ మాట్లాడుతూ.. ఏటా క్రీడల కోసం వర్సిటీ దాదాపు రూ.2 కోట్లు వ్యయం చేస్తుందని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, వర్సిటీ వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పాతూరి శ్రీనివాసరావు, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ వెంకట్రావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు, వైస్ ప్రిన్సిపల్ సతీష్‌బాబు, వివిధ కళాశాలల వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా, నాకౌట్ కం లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీలో వర్సిటీ పరిధిలోని 20 కళాశాలల జట్లు పాల్గొన్నారు. అంతర్ కళాశాలల విజేతతోపాటు వర్సిటీ జట్టును ఎంపిక చేయనున్నట్టు టోర్నమెంట చైర్మన్, కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు.
తొలిరోజు విజేతలు వీరే..
పురుషుల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 20 కళాశాలల జట్లు తలపడనున్నాయి. తొలిరోజు చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుపై విక్టరీ డిగ్రీ కళాశాల (నరసరావుపేట) జట్టు 25–13, 25–5తో విజయం సాధించింది. పీఎన్‌సీ అండ్ కేఆర్ కళాశాల (నరసరావుపేట) జట్టుపై బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు 25–16, 25–17తో గెలిచింది. ఎస్‌కేఆర్‌బీఆర్ జట్టుపై వర్సిటీ కళాశాల జట్టు 25–14, 25–22తో విజయం సాధించింది. వాగ్దేవి డిగ్రీ కళాశాల (నరసరావుపేట) జట్టుపై టీజేపీఎస్ కళాశాల (గుంటూరు) జట్టు 25–27, 25–23, 15–04తో గెలిచింది. విద్యా కేంద్రం (సత్తెనపల్లి) జట్టుపై కృష్ణవేణి డిగ్రీ కళాశాల (నరసరావుపేట) జట్టు విజయం సాధించింది.


