పది పరీక్షల షెడ్యూల్ విడుదల డీఈఓ చంద్రకళ
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం తెలిపారు. మార్చి 16వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లిష్, 23న గణితం, 25న ఫిజిక్స్, 28న బయోలజీ, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఏప్రిల్ 1న ఒకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుందని వివరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ వివరాలను యుడైస్ వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలని తెలిపారు. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకు వెళ్లి సరిచేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫీజును ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేసే పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
రేపు క్రోసూరులో జాబ్‌మేళా
క్రోసూరు: క్రోసూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన సోమవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి జి.తమ్మాజీరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్‌మేళాకు పలు కంపెనీలు హాజరువుతున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు విద్యార్హతను బట్టి రూ.15,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుందన్నారు. 10వ తరగతి, ఆపై చదువులు చదివి 18 నుంచి 35 సంవత్సరాలలోపు నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. బయోడేటా, చదువుకున్న సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ నకలు, ఫొటోలు తీసుకుని ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటలలోపు హాజరుకావచ్చన్నారు. వివరాలకు 7779858789, 8074393466 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
శ్రీసత్యసాయి అన్నప్రసాద వితరణ
నరసరావుపేట ఈస్ట్: శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం శ్రీసత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్, సతైనపల్లిరోడ్డు మహాలక్ష్మమ్మ చెట్టు, పల్నాడు బస్టాండ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కేంద్రాలలో దాదాపు 8వేల మందికి ప్రసాదం అందించారు. శ్రీసత్యసాయి భజన మండలి కన్వీనర్ కూనిశెట్టి సత్యసాయి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలి సభ్యులు, సీ్త్ర సేవాదళ్ సభ్యులు సేవలు అందించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వనమా సాంబశివరావు పాల్గొన్నారు.


