రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నలుగురికి తీవ్రగాయాలు
రెంటచింతల: మండల పరిధిలోని గోలి గ్రామ శివారులో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం హాలియాకు చెందిన కంటోజు పరిపూర్ణాచారి(42) తన అన్న శ్రీనివాసచారితో కలిసి గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లెలు భర్త గోవిందాచారిని పరామర్శించారు. వా రు తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం హాలియా వెళ్తున్న సమయంలో నాగమయ్య దేవస్థానం సమీపంలో సమాధానపేటకు చెందిన వేల్పుల నరేంద్ర, జొన్నలగడ్డ సంతోస్, గుంజరి వెంకటేష్ ముగ్గురు మరో ద్విచక్రవాహనంపై వేగంగా వస్తూ బలంగా ఢీకొనడంతో రెండు వాహనాలపై నున్న ఐదుగురు కిందపడ్డారు. ప్రమాదంలో పరిపూర్ణాచారి తల బలంగా రోడ్డుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురికి తీవ్రగాయాల య్యా యి. వారిని ఏపీ జన్‌కో అంబులెన్స్ వాహనంలో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని నరసరావుపేట తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


