మద్దతు ధరకు పత్తి కొనుగోలు
జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు
క్రోసూరు: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తుందని, కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8110 ఇస్తున్నట్లు, ఈ–పంటలో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే తమ పత్తిని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకునే అవకాశం ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు చెప్పారు. మండలంలోని పీసపాడు, ఎర్రబాలెం గ్రామాలను జిల్లా వ్యవసాయాధికారి శుక్రవారం సందర్శించి పత్తి రైతులతో మాట్లాడారు. రైతులు గ్రామంలోని రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి తమ వివరాలను యాప్‌లో నమోదు చేయించుకోవాలన్నారు. తమకు ఇష్టమైన కొనుగోలు కేంద్రాన్ని, పత్తిని తీసుకువచ్చే తేదీని ఎంపిక చేసుకొని ఆ వివరాలను కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. యాప్‌లో నమోదు చేసుకున్న తర్వాత తేదీ ప్రకారం ఎంపిక చేసుకున్న జిన్నింగ్ మిల్లుకు పత్తిని తీసుకువెళ్లాలని రైతులకు సూచించారు. వీలుకాని పక్షంలో ముందు రోజు బుకింగ్‌ను రద్దు చేసుకోవచ్చన్నారు. మార్కెట్ యార్డులోని జీడీసీఎంసీ ఎరువుల అమ్మకం కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, ఎరువుల నిల్వలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్, రైతు సేవా కేంద్ర సిబ్బంది సుబ్బారావు (పీసపాడు), సౌజన్య (ఎరబ్రాలెం), ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.


