ఆలయాలు ముస్తాబు
పల్నాటి వీరుల ఇలవేల్పు చెన్నకేశవస్వామి, వీరుల అంకాలమ్మ, శక్తి దేవతలు పోలేరమ్మ, పాతపాటేశ్వరమ్మ వార్లు ఉత్సవాలకు ముస్తాబయ్యారు. వీరాచారులు, వేలాది భక్తులకు ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీ.శ 11వ శతాబ్దం నాటి ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకుంటున్నాయి. ఐదు రోజుల ఉత్సవాలలో చెన్నకేశవస్వామి, శక్తి దేవతలకు వీరాచారులు పూజలు చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. వీరుల ఆయుధాలతో దేవతలను దర్శించుకుని పూజ తర్వాత ఆయుధాలతో విన్యాసాలు చేస్తూ కత్తులతో గుండెలపై మోదుకుంటూ ఆచారాన్ని నెరవేర్చుతారు. మొక్కులు చెల్లిస్తారు. వీరావేశంతో వారు వేసే చిందులతో పల్నాటి పౌరుషం ఉత్సవ వేళ ఉట్టిపడుతుంది. ఉత్సవాలలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడ్ల పోటీలను ప్రారంభించారు.ఆర్డీఓ మురళి, డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు.


