రెండేళ్లయినా రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఏవీ? | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లయినా రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఏవీ?

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

రెండేళ్లయినా రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఏవీ?

కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఆందోళనలో పేదలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ‘సెంటు కాదు, రెండు సెంట్ల స్థలం ఇస్తామన్నారు. అది కూడా నగరాల్లోనే అని నమ్మబలికారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరికీ స్థలాలు ఎందుకు ఇవ్వలేదు’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని పట్టణ పేదలు ప్రశ్నించారు. ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు ఇళ్ల ఊసెత్తడం లేదంటూ మండిపడ్డారు. నగరంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్‌లు, టిడ్కో ఇళ్లు, సంక్షేమ పథకాలు అమలు కోరుతూ సీఐటీయూ, ఐద్వా, పౌర సంక్షేమ సంఘాల ఆధ్వ ర్యంలో విజయవాడ కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పేదలు తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌.బాబూరావు, దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సంస్థలు, అదానీ, అంబానీలకు వందల ఎకరాలను రాత్రికి రాత్రే ఎకరం రూపాయికే ఇస్తున్న ప్రభుత్వం పేద లను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ భూములను ప్రజా ప్రతినిధులు కబ్జా చేసి కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్కీం పెడుతున్నానని చెబుతున్న సీఎం చంద్రబాబు, పేదలు పనులు లేక, ఇళ్లు లేక రోడ్డున పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. కొండల పైన, కృష్ణా నది ఒడ్డున పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని, వాటికి రిజిస్ట్రేషన్‌ పట్టాలు లేవని పేర్కొన్నారు. పేదలు నివాసం ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ సౌకర్యం కల్పించాల న్నారు. విజయవాడలో డిస్నీ ల్యాండ్‌లో 57 ఎకరాల ఖాళీ స్థలం, ఇతర శాఖల భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం ఆందోళన వద్దకు వచ్చి వినతి పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి, నగర ప్రజా సంఘాల నాయకులు బోయి సత్యబాబు, బి.రమణారావు, పి.కృష్ణ, సీఐటీయూ నాయకులు దుర్గారావు, నారాయణ, నాగేశ్వరరావు, ఐద్వా నాయకులు కె.సరోజ, జి.ఆదిలక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement