పటమట(విజయవాడతూర్పు): ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కట్టడికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. సాంకేతికత, పటిష్ట నిఘాతో బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై తీసుకుంటామన్నారు. పోలీస్‌కమిషరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సైబర్ క్రైం డీసీపీ కృష్ణప్రసన్నతో కలిసి నలుగురు ఏసీపీలతో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందంతో సీపీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా జరుగుతున్న బెట్టింగ్ కార్యకలాపాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయిని పేర్కొన్నారు. బెట్టింగ్‌లపై హైటెక్ నిఘా ఏర్పాటు చేసి, బెట్టింగ్ నెట్‌వర్క్‌లపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డిజిటల్ వార్ చేయాలని ఆదేశించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లు, డార్క్ వెబ్ కార్యకలాపాలపై నిరంతరం పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో బెట్టింగ్ ప్రచారా లను గుర్తించాలని, ఈ సమాచారంతో ఎప్పటికప్పుడు సిబ్బందితో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి నిందితులను అరెస్టు చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డైల్ 100/112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు.


