● ఆలయ మొదటి ప్రాకారంలో మీడియాతో ప్రసంగం ● చైర్మన్ సమక్షంలో అమరావతి రైతుల పేరిట అత్యుత్సాహం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పాటించాల్సిన శాస్త్రాలను, నియమ నిబంధనలను తుంగలోకి తొక్కి పెడుతున్నారు. అమరావతి రైతుల పేరిట కొంత మంది ఆలయ ప్రాంగణంలోని వేద ఆశీర్వచన మండపంలో(మొదటి ప్రాకారం) మీడియాతో ప్రసంగించిన ఘటన దుర్గగుడిలో సోమవారం చోటు చేసుకుంది. రైతు కుటుంబాల పేరిట దర్శనానికి వచ్చిన వారు ఆలయ ప్రాంగణంలో అత్యుత్సాహం ప్రదర్శించడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఆశీర్వచన మండపంలో వారు ప్రసంగిస్తున్నా అడ్డుకోవాల్సిన వారు మిన్నకుండిపోయారు. అంతే కాకుండా వారి ప్రసంగాన్ని దేవస్థాన అధికారులే మీడియాకు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్తూ దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ సమక్షంలోనే ఈ తంతు జరగడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని పార్లమెంట్‌లో ఆమోదించిన నేపథ్యంలో సోమవారం కొంతమంది రాజధాని ప్రాంతానికి చెందిన వారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకడమే కాకుండా వేద ఆశీర్వచనం అందించారు. అయితే ఈ సమయంలో దర్శనానికి వచ్చిన వారు వేద ఆశీర్వచన మండపంలో మీడియాతో మాట్లాడటం వివాదానికి కారణమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు సైతం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన తరుణంలో ఆలయం వెలుపల మీడియా పాయింట్ లేదా గాలిగోపురం, రాజగోపురం వద్ద మీడియాతో మాట్లాడతారు. ఇందుకు విరుద్ధంగా అమరావతి రైతుల పేరిట వచ్చిన వారు ఆశీర్వచన మండపంలో ప్రసంగాలు చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ వ్యవహారాలలో వరుస వివాదాలకు కారణమవుతున్న దుర్గగుడి పాలక మండలి సభ్యులు, చైర్మన్‌లకు దేవస్థానంలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదనే కనీస అవగహన కల్పించాల్సిన అవసరం కలుగుతోందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో ప్రజల నుంచి 75 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికంగా భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 30 ఫిర్యాదులు అందాయి. ఇతర ఫిర్యాదుల్లో కుటుంబ తగాదాలపై 7, వివిధ మోసాలపై 6, మహిళా సంబంధిత నేరాలపై 10, దొంగతనాలపై 5, కొట్లాటలపై 2, ఇతర వివిధ సమస్యలపై 17 ఫిర్యాదులు అందాయి.


