గంజాయి, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

గంజాయి, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

పెనమలూరు: పలు ప్రాంతాల నుంచి గంజాయి, మాదక ద్రవ్యాలు తెచ్చి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పోరంకి ప్రభునగర్‌కు చెందిన షేక్‌ జాన్‌బాషా(జాన్‌బెర్రీ,24), రామవరప్పాడుకు చెందిన అబ్దుల్‌ అక్బర్‌(29) గంజాయి, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో సోమవారం పోరంకి శ్మశానవాటిక వద్ద అరెస్టు చేసి వారి వద్ద 4 కేజీల గంజాయి, ఒక గ్రాము ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నామన్నారు. షేక్‌ జాన్‌బాషా 14 వ ఏటే గంజాయికి అలవాటు పడ్డాడని, అతనిపై కృష్ణలంక, పెనమలూరు, రాజమండ్రి, విశాఖపట్నం పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటు కూడా ఉందన్నారు. అబ్దుల్‌ అక్బర్‌ 16వ ఏట నుంచే గంజాయి తాగుతూ బైక్‌ల దొంగతనాలు, గంజాయి అమ్మకాలు చేస్తున్నాడని, అతనిపై పెనమలూరు, అజిత్‌సింగ్‌నగర్‌, మాచవరం, నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు.

మైనర్‌ పిల్లలకు గంజాయి ఎర

పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్లు సాయిన అనంతకుమార్‌, కొక్కిలిగడ్డ మహేష్‌తో కలిసి విజయవాడలో రూమ్‌ తీసుకుని అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి పొట్లాలు సరఫరా చేస్తూ విక్రయిస్తున్నారన్నారు. మైనర్‌ పిల్లలను టార్గెట్‌గా చేసుకుని వారికి గంజాయి అలవాటు చేశారన్నారు. విశాఖపట్నం, ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి నగర పరిధిలో వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. బెంగళూరులో అబ్దుల్‌ అక్బర్‌, నైజీరియన్‌ దేశస్తుల నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి విజయవాడ ప్రాంతంలో విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు అమ్ముతున్నారని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని వివరించారు. సమావేశంలో సీఐ వెంకటరమణ, ఎస్‌ఐలు సుశాకర్‌, తాతాచారి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement