
హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉన్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలలో భాగంగా న్యూ కేటగిరీ విభాగంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను గురువారం రాత్రి పశుప్రదర్శన కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూ కేటగిరీ విభాగంలో ఎనిమిది జతలు పోటీలో పాల్గొన్నాయన్నారు. పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు.
నగదు బహుమతుల అందజేత
గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఆరుపళ్ల విభాగం పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన శ్రీకావ్య నంది బ్రీడింగ్ బుల్స్ నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 15 నిమిషాల వ్యవధిలో 3911.08 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని కావ్యమధు ఎడ్ల జత 3583.2 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం పంగులూరు గ్రామానికి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి గ్రామానికి చెందిన గాదే అశేర్ సుమన్వీరెడ్డి ఎడ్ల జత 3,481.8 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, పల్నాడు జిల్లా నకిరేకల్ మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన మేక అంజిరెడ్డి ఎడ్ల జత 3412.3 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 3,313.3 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేల చొప్పున నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ పాల్గొన్నారు.