
దోమల నియంత్రణ ద్వారానే డెంగీ నివారణ సాధ్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దోమల నియంత్రణ ద్వారానే డెంగీ వ్యాధిని అరికట్టగలుగుతామని, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రాణాంతక డెంగీ వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈనెల 16వ తేదీ జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా డెంగీ వ్యాధి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమల నియంత్రణ ద్వారానే డెంగీ వ్యాధిని అరికట్టగలుగుతామన్నారు. డెంగీ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సంబంధిత అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అధిక జ్వరం, తలనొప్పి, కంటి వెనుక భాగంలో నొప్పి, కండరాల నొప్పి, చర్మంపై గుండ్రటి మచ్చలు వంటి లక్షణాలు ఉన్న వారికి వెంటనే డెంగీ పరీక్షలు నిర్వహించాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియను ప్రతి సచివాయాలనికి అనుసంధానించాలని అన్నారు. దోమల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వి.మోతీబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాచర్ల సుహాసిని, వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ