
పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు
జగ్గయ్యపేట: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా పార్ బాయిల్డ్ బియ్యం కొనుగోళ్లు నిలిచిపోవటంతో మిల్లు యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. గత 45 రోజులుగా ఎఫ్‌సీఐ కొనుగోళ్లు ఆపివేయటంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. అయినా పౌర సరఫరాల శాఖాధికారులు పట్టించుకోవటం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మిల్లుల్లో 10 వేల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి.
జిల్లాలో నాలుగు మిల్లులు..
జిల్లాలో జగ్గయ్యపేటలో వెంకటేశ్వర పార్ బాయిల్డ్, అనుమంచిపల్లిలో శ్రీ పద్మావతి శ్రీనివాసా, విస్సన్నపేట మండలం పుట్రేలలోని వెంకటేశ్వర, ఎ.కొండూరులోని వెంకట శేషసాయి పార్ బాయిల్డ్ రైస్ మిల్లులున్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మిల్లుల వద్ద నుంచి పార్‌బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తుంది. 45 రోజులుగా కొనుగోళ్లు నిలిపివేయటంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రబీ సీజన్ ముగియటంతో ఆయా గ్రామాలలోని రైతు సేవా కేంద్రాల ద్వారా వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటికే మిల్లుల్లో ఽనిల్వ ఉన్న ధాన్యంతో రైతులు తీసుకువచ్చే ధాన్యానికి స్థలం లేక ధాన్యం తీసుకోమంటూ మిల్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇటీవల జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నందిగామ ప్రాంతాల్లోని రైతులకు, యజమానులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరొక పక్క యజమానులు మాత్రం ఎఫ్‌సీఐ అధికారులు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తే మిల్లుల్లో ధాన్యం ఖాళీ అవుతుందని, అప్పుడు రబీ సీజన్‌కు ధాన్యం తీసుకునేందుకు మిల్లుల్లో అనువుగా ఉంటుందని, రైతులకు గోనె సంచుల కొరత ఉండదని చెబుతున్నారు.
రంగు మారే అవకాశం..
ఎఫ్‌సీఐ బియ్యం కొనుగోలు చేయకపోవటంతో మిల్లుల్లో ఆరుబయట ఉన్న ధాన్యం బాయిల్డ్ సమయంలో రంగు మారే అవకాశం ఉందని అంతేకాకుండా వర్షాలు పడుతుండటంతో తడిసే అవకాశం ఉందని మిల్లర్లు చెబుతున్నారు. బ్యాంకు గ్యారంటీ గడువు కూడా ముగుస్తుందని, ఎఫ్‌సీఐ అధికారులు కనీస నిబంధనలు కూడా చెప్పటం లేదని వాపోతున్నారు.
45 రోజులుగా నిలిచిన ఎఫ్‌సీఐ బియ్యం కొనుగోళ్లు పట్టించుకోని అధికారులు రబీ ధాన్యం తీసుకునేందుకు స్థలం లేక మిల్లర్ల ఇబ్బందులు జిల్లాలోని మిల్లుల్లో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు
రెండు, మూడు రోజుల్లో కొనుగోళ్లకు అనుమతులు
పార్ బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి ఎఫ్‌సీఐ గోడౌన్‌లకు బియ్యం కొనుగోళ్లకు రెండు, మూడు రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని మిల్లర్లతో మాట్లాడుతున్నాం. అనుమతులు రాగానే కొనుగోలు చేస్తాం.
– సతీష్, పౌరసరఫరాల శాఖ డీఎం