పటమట(విజయవాడతూర్పు): ఖేలో ఇండియా–2025 యూత్ గేమ్స్ అండర్–18 కేట గిరీలో ఆలిండియా చాంపియన్‌షిప్‌లో 64 పాయింట్లతో ఏపీ తృతీయ స్థానంలో నిలిచింది. విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన అండర్–18 స్విమ్మర్లు తీర్థు సామదేవ్, దేవ గణేష్, యజ్ఞ సాయిలను వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం కమిషనర్ ధ్యానచంద్ర అభినందించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన స్విమ్మర్లకు వీఎంసీ తరఫున అన్ని విధాలా సహకరిస్తామని, భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ డాక్టర్ లత, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఐ.రమేష్, కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ వి.వినోద్, సహాయక కోచ్ నితీష్, ఇతర కోచ్‌లు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో బంగారు పతకం
పెనమలూరు: రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బాడీ బిల్డర్ సీహెచ్ దుర్గాప్రసాద్ 70 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడని జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, అశోక్ తెలిపారు. మంగళవారం వివరాలు వెల్లడిస్తూ ఈ నెల 12న సత్యసాయి జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన కదిరిలో రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించారన్నారు. దుర్గాప్రసాద్ 70 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించగా, 70 కేజీల పైవిభాగంలో రాహుల్‌కృష్ణ బెస్ట్ ఆఫ్ సిక్స్ సాధించాడన్నారు.
ప్రశాంతంగా రెండో రోజు ఇంటర్ పరీక్షలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. మొదటి ఏడాది పరీక్షకు 15,494 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 14,846 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 293 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 253 మంది రాశారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 346 మంది విద్యార్థులకు 276 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 54 మంది విద్యార్థులకు 42 మంది హాజరయ్యారు.

తిరుపతమ్మకు బోనాలు