
కలెక్టరేట్‌లో ఇగ్నైట్ సెల్ ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర ః 2047 లక్ష్యాలను దశల వారీగా చేరుకునేందుకు జిల్లాస్థాయిలో ఇగ్నైట్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఇగ్నైట్ సెల్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ ప్రత్యేక సెల్ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలపై అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త సాకారం దిశగా ఔత్సాహికులను సరికొత్త ఆలోచనలతో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ సెల్ అవసరమైన సహాయసహకారాలు అందిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, వాటికోసం దరఖాస్తు చేసుకోవడంలోనూ తోడ్పడుతుందన్నారు. ఇందు కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ సిబ్బంది ఉంటారన్నారు. రోజుకో డిపార్టుమెంట్ ఇగ్నైట్ స్టాల్‌ను ఏర్పాటుచేస్తుందని, ఆ శాఖ కార్యకలాపాలతో పాటు ఆ శాఖ పరిధిలోని పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తుందని వివరించారు. ప్రజల నుంచి వచ్చే కొత్త ఆలోచనలను సరైన విధంగా నమోదుచేసే డాక్యుమెంటేషన్ సెంటర్‌గా కూడా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. తొలిరోజు వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయం, రైతు సాధికార సంస్థ స్టాళ్లను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డీపీఓ పి.లావణ్య కుమారి, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.