
దుర్గమ్మ ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు నిర్వహించిన సుప్రభాత సేవకు 15 మంది ఉభయదాతలు హాజరయ్యారు. అనంతరం అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన 32 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తి వద్ద నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొనగా, రికార్డు స్థాయిలో చండీహోమానికి 139కు టికెట్లను విక్రయించారు. రెండు 250 మందికి పైగా భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది.