
మంత్రిని కలవకుండా సీహెచ్‌ఓలను అడ్డుకున్న పోలీసులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రిని కలుద్దామని వస్తే అడ్డగిస్తారా అంటూ పోలీసులపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్‌ఓ) ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా సమస్యల పరిష్కారం కోరుతూ సీహెచ్‌ఓలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వస్తున్నట్లు సీహెచ్‌ఓలు తెలుసుకున్నారు. తమ సమస్యలను మంత్రికి వివరిద్దామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని కళాక్షేత్రం ఆవరణలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య రంగానికి సంబంధించి ఎవరూ పట్టించుకోని సందర్భంలో చివరికి మంత్రిని కలుద్దామని వస్తే కలవనివ్వక పోవడం దుర్మార్గమని వాపోయారు.