
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 75ఏళ్ల వ్యక్తితో 35ఏళ్ల మహిళకు వివాహం జరిపించారు. తీరా పెళ్లి తర్వాత రోజే.. హనీమూన్‌కు ముందే సదరు వ్యక్తి మృతిచెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలోని కుచ్‌ముచ్ గ్రామానికి చెందిన సంగ్రురామ్(75) భార్య గతేదాడి చనిపోయింది. వారికి పిల్లలు లేకపోవడంతో ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. అయితే, తనకు తోడు కోసం మరో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో, జలల్‌పూర్ ప్రాంతానికి చెందిన మన్బవతిని(35) వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆమెకు అప్పటికే వివాహం కాగా.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరి వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో సెప్టెంబర్ 29వ తేదీన వారికి వివాహం జరిగింది.
ఇక, ఈ జంట కోర్టులో వివాహాన్ని నమోదు చేసుకున్నారు. తరువాత స్థానిక ఆలయంలో సాంప్రదాయ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం, వధువు మన్భవతి మాట్లాడుతూ.. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. నా పిల్లలను పోషించే బాధ్యత సంగ్రురామ్ చూసుకుంటానని చెప్పారు. నన్ను ఇంటి బాధ్యతలు చూసుకోమన్నారు. తనకు ఉన్న ఆస్తిని కూడా పిల్లల పేరు మీదకు మారుస్తానని చెప్పినట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరూ తమ ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచే సరికి సంగ్రురామ్.. చనిపోయి ఉన్నాడు. దీంతో, స్థానికుల సాయంతో అతడికి ఆసుపత్రికి తరలించగా.. అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో, ఒక్కసారిగా మన్బవతిని షాక్‌కు గురైంది. అనంతరం, అతడికి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించగా.. కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. సంగు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని.. పోస్టుమార్టం చేయాలని అన్నారు. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, మొదటి రాత్రి ముందు రోజే సంగ్రురామ్ ఇలా మృతి చెందడం పట్ల స్థానికులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.