
పట్నా: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలుచేసే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి మైనారిటీలపై అనుచితంగా మాట్లాడారు. బిహార్‌లో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఆదివారం అర్వాల్ జిల్లాలో గిరిరాజ్ మాట్లాడారు. ‘‘ఒకసారి నేను మౌల్వి(ముస్లిం మతాధికారి)ని ఒక ప్రశ్న వేశా. మీకు కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యకార్డ్ ఉందా? అని అడిగితే ఉంది అని చెప్పారు. హిందూ–ముస్లిం ప్రాతిపదికన మాత్రమే ప్రభుత్వం ఈ కార్డ్‌లు ఇచ్చిందని భావిస్తున్నారా? అని అడిగితే లేదు అని సమాధానం చెప్పారు. మీకు నాకు ఓటేశారా? అంటే అవునన్నారు. మరి ఖుదా (దైవం) మీద ప్రమాణంచేసి నిజం చెప్పండి అంటే ఆయన చెప్పలేదు.
ముస్లింలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ వాడుకుంటారు. వాటి ప్రయోజనాలు, లబ్ధి పొందుతారు. కానీ ఓటు మాత్రం మాకు వేయరు. ఇలాంటి వాళ్లనే నమ్మకద్రోహులు అంటారు. మీలాంటి వాళ్ల ఓటు నాకు వద్దు అని ఆయన ముఖం మీదనే చెప్పేశా’’ అని ర్యాలీలో గిరిరాజ్‌సింగ్ వెల్లడించారు. ‘‘బిహార్‌లో మొత్తం మౌలికసదుపాయాల కల్పనకు ఎన్‌డీఏ ప్రభుత్వం ఎంతో చేసింది. బిహార్‌లో రోడ్డు కేవలం ఎన్‌డీఏ నేతల కోసం వేయలేదు. మొత్తం ప్రజల కోసం వేశారు. ఇప్పుడు బిహార్ ఎంతో మారింది. సమాజంలోని ప్రతి వర్గం కోసం ఎన్‌డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది. అయినాసరే ముస్లింలు బీజేపీకి ఓటు వేయట్లేరు’’ అని ఆయన అన్నారు.
మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్