
వాషింగ్టన్: ఉత్తరకొరియాతో సత్సంబంధాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ సమక్షంలో కొరియా ద్వీపకల్పంలో శాంతిని తీసుకురావాలనే తన కోరికను అభివ్యక్తం చేశారు. ఇందుకోసం ఉత్తర కొరియా సుప్రీం నేత కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం కావాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన లీని తొలిసారిగా ట్రంప్ వైట్‌హౌస్‌కు స్వాగతించారు. ఈ సందర్భంగా ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో తగిన సమయంలో కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ తనతో మంచిగా వ్యవహరించారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా,దక్షిణ కొరియా సమావేశంలో.. లీ జే మ్యుంగ్ కూడా ట్రంప్ సారధ్యంలో కొరియా ద్వీపకల్పానికి శాంతి చేకూరాలనే అభిలాషను వ్యక్తం చేశారు.
ప్రపంచంలో ప్రత్యేక దేశంగా పేరొందిన కొరియా ద్వీపకల్పంలో ట్రంప్ శాంతిని తీసుకురాగలరని ఆశిస్తున్నానని, కిమ్ జోంగ్ ఉన్‌కు సన్నిహితులు కాగలరని, ఉత్తర కొరియాలో ట్రంప్ ప్రత్యేక ప్రపంచాన్ని (రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్) నిర్మించగలరని లీ జే మ్యుంగ్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఉత్తర కొరియా ఇంకా స్పందించలేదు. అయితే దక్షిణ కొరియాతో యూఎస్ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా మీడియా ప్రత్యేక దృష్టి సారించిందని సమాచారం. కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకోవాలనే కాంక్ష అమెరికాలో ఉందనే అభిప్రాయాన్ని ఉత్తర కొరియా వ్యక్తం చేసింది.
కాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు వైట్ హౌస్ నుంచి పదేపదే ఆహ్వానాలు అందినప్పటికీ అతను విస్మరిస్తూనే వస్తున్నారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ తన మొదటి పదవీకాలంలోనూ ఉత్తరకొరియాతో దౌత్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. గడచిన జూలైలో ట్రంప్.. కిమ్‌తో భేటీని కోరుతూ లేఖ రాయగా, దానిని ఉత్తర కొరియా ఐక్యరాజ్యసమితి కార్యాలయ సిబ్బంది తిరస్కరించారని ఉత్తర కొరియా మీడియా తెలిపింది.