
ప్రభుత్వ పాఠశాలలకంటే ప్రైవేటులో ప్రియం
ప్రాంతం ఏదైనా ఫీజుల్లో ఎన్నో రెట్ల తేడా
ఖరీదైన వ్యవహారంగా కిండర్‌గార్టెన్ విద్య
స్కూల్ ఫీజు అనగానే సగటు జీవి బెంబేలెత్తిపోతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలు అయితే పెద్దగా భారం అనిపించదు. సమస్యల్లా ప్రైవేటు స్కూళ్లతోనే. ఎందుకంటే అక్కడ చదువు‘కొనాల్సిందే’. ఇది జగమెరిగిన సత్యం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఏటా అవుతున్న సగటు ఖర్చుల్లో తేడా ఎన్నో రెట్లు ఉంటోంది. పట్టణాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.
దేశంలో కిండర్‌గార్టెన్ (కేజీ) విద్య.. అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదువుకు ఏటా అయ్యే ఖర్చు ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా ఉంది. ప్రీ–ప్రైమరీ స్థాయిలో ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేటు స్కూళ్లలో ఒక్కో విద్యార్థికి ఏటా అయ్యే వ్యయం.. గ్రామీణ ప్రాంతాల్లో 21.8 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 16.1 రెట్లు అధికంగా ఉంది. 9, 10వ తరగతులు (సెకండరీ), 11, 12 తరగతుల (హయ్యర్ సెకండరీ) విషయంలో ఈ వ్యత్యాసం తక్కువగా ఉంది.
కేంద్ర గణాంక శాఖ 2025 ఏప్రిల్–జూన్ మధ్య చేపట్టిన సర్వే ఆధారంగా రూపొందించిన ‘కాంప్రహెన్సివ్ మాడ్యులర్ సర్వే: ఎడ్యుకేషన్ 2025’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వ్యయం అంటే.. స్కూల్లో అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, డెవలప్‌మెంట్ ఫీజు, ఇతరత్రా కార్యక్రమాలకోసం చేసే ఖర్చు; రవాణా, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ.. ఇలా విద్యార్థి చదువు కోసం చేసిన మొత్తం ఖర్చు.
